నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణలో భూముల విలువలు, రైతుల నష్టపరిహారం అంశంపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా రాయదుర్గం ప్రాంతంలో టీజీఐసీ నిర్వహించిన భూముల వేలంలో ఎకరం ధర ₹237 కోట్లకు చేరడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.
6.29 ఎకరాల భూమిని ₹1490.73 కోట్లకు గౌర వెంచర్స్ దక్కించుకోవడంతో.. “ప్రభుత్వ భూమికి వందల కోట్లు వస్తే రైతు భూమికి ఎందుకు రావు?” అనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. రావిర్యాల ప్రాంతంలో గజం ధర ₹83,500 వరకు వెళ్లిందన్న చర్చ కూడా దీనికి మరింత బలం చేకూరుస్తోంది.
ఇప్పుడేమో “ఫ్యూచర్ సిటీ” పేరుతో దాదాపు 30 వేల ఎకరాల భూమి అవసరం ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఈ భూముల్లో ఎక్కువ భాగం రైతుల వ్యవసాయ భూములు, ఇళ్లు, జీవనాధారాలేనని స్థానికులు చెబుతున్నారు.
ఇక్కడే అసలు వివాదం మొదలవుతోంది. ప్రభుత్వం తన భూమిని మార్కెట్ రేట్లకు విక్రయిస్తుంటే.. రైతుల భూములను మాత్రం తక్కువ ధరలకు తీసుకోవడం సరైందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఎకరం ₹237 కోట్లకు అమ్మితే.. రైతుకు కనీసం ₹100 కోట్లు ఇవ్వాలి” అంటూ పలువురు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రెండు ఎకరాలు తీసుకుంటే ₹500 కోట్లు ఇవ్వాలని, లేదంటే భూములు ఇవ్వమని రైతులు నిలబడాలని కొందరు పిలుపునిస్తున్నారు.
భూమి సేకరణ సమయంలో మాత్రం ప్రభుత్వ రేట్లు, రిజిస్ట్రేషన్ విలువలు చూపిస్తూ రైతులకు ₹10 లక్షలు, ₹20 లక్షలు, ₹30 లక్షల మధ్యే పరిహారం ఇస్తారని విమర్శలు వస్తున్నాయి. కానీ అదే భూమిని తర్వాత ప్రైవేట్ కంపెనీలకు భారీ ధరలకు విక్రయిస్తారని ఆరోపిస్తున్నారు.
“రైతుల భూమిని తక్కువ రేటుకు తీసుకుని.. తర్వాత అదే భూమి వందల కోట్లకు మారుతుంది. మరి ఆ లాభంలో రైతుకు వాటా ఎందుకు ఉండకూడదు?” అనే ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.
ఇంకొందరు రైతులు భూమికి భూమి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. నాలుగు ఎకరాలు తీసుకుంటే నాలుగు ఎకరాలు ఇవ్వాలని, లేకపోతే నిజమైన మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని అంటున్నారు.
ఫ్యూచర్ సిటీ పేరుతో భారీ భూసేకరణ జరిగితే వేలాది రైతు కుటుంబాలు ప్రభావితమవుతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పంట భూములు పోతాయని, గ్రామాలు ఖాళీ కావాల్సిన పరిస్థితి వస్తుందని స్థానికులు చెబుతున్నారు.
మొత్తంగా రాయదుర్గం భూముల వేలం ఇప్పుడు తెలంగాణలో రైతుల నష్టపరిహారం, భూసేకరణ, రియల్ ఎస్టేట్ విలువలు, అభివృద్ధి పేరుతో జరుగుతున్న ప్రాజెక్టులపై పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది.

