ఆస్ట్రాలజీ స్కామ్ బట్టబయలు.. పూజల పేరుతో లక్షల దోపిడి.. బ్లాక్ మెయిల్‌తో సైబర్ మోసం!

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. “మీ జీవితంలో సమస్యలున్నాయా?”, “ప్రేమలో విఫలమయ్యారా?”, “వశీకరణ పూజలతో మీ కోరికలు నెరవేరుస్తాం” అంటూ కనిపించే ప్రకటనలు ఇప్పుడు కొత్త తరహా సైబర్ మోసాలకు కేంద్రంగా మారుతున్నాయి. జ్యోతిష్యం, తంత్ర పూజలు, దోష నివారణ పేరుతో అమాయకులను టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు లక్షల్లో డబ్బులు దోచుకుంటున్నట్లు సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం Facebook, Instagram, WhatsApp, YouTube వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఫేక్ ఆస్ట్రాలజీ అకౌంట్లు, నకిలీ బాబాల ప్రకటనలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ప్రేమ సమస్యలు, వ్యాపార నష్టాలతో బాధపడుతున్న వారిని టార్గెట్ చేస్తూ ఈ మోసాలు జరుగుతున్నాయి.

ముందుగా బాధితులతో ఎంతో నమ్మకంగా మాట్లాడే ఈ కేటుగాళ్లు వారి వ్యక్తిగత సమస్యలు, కుటుంబ వివరాలు, ఫోటోలు వంటి సమాచారాన్ని సేకరిస్తారు. “మీకు తీవ్రమైన దోషం ఉంది”, “ప్రత్యేక పూజ చేయాలి”, “వశీకరణ శక్తి ద్వారా సమస్య పరిష్కరిస్తాం” అంటూ మొదట చిన్న మొత్తాల్లో డబ్బులు తీసుకుంటారు. ఆ తర్వాత సమస్య పెద్దదిగా ఉందని చెబుతూ విడతల వారీగా వేల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

ఒక దశలో బాధితులు డబ్బులు ఇవ్వలేమని చెబితే అసలు బెదిరింపులు మొదలవుతున్నాయి. “పూజ ఆపేస్తాం”, “నీ కుటుంబానికి ప్రమాదం జరుగుతుంది”, “నువ్వు పంపిన ఫోటోలు సోషల్ మీడియాలో పెడతాం” అంటూ మానసికంగా భయపెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇలాంటి మోసాల్లో నేరగాళ్లు తమ అసలు గుర్తింపులు బయటపడకుండా ఇతరుల బ్యాంక్ ఖాతాలు, ఫేక్ UPI ఐడీలు, నకిలీ సోషల్ మీడియా అకౌంట్లు ఉపయోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొందరు పోలీస్ అధికారులు, ప్రముఖులు, ఆధ్యాత్మిక గురువుల ఫోటోలు కూడా దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించారు.

సైబర్ క్రైమ్ విభాగం ప్రకారం.. “24 గంటల్లో సమస్య పరిష్కారం”, “గ్యారంటీ వశీకరణ”, “ప్రత్యేక రహస్య పూజ” వంటి ప్రకటనలను ప్రజలు అస్సలు నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత ఫోటోలు, బ్యాంక్ వివరాలు, OTPలు ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని సూచిస్తున్నారు.

ఏదైనా అనుమానాస్పద పరిస్థితి ఎదురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని, అలాగే సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఆధ్యాత్మిక ప్రకటన నిజం కాకపోవచ్చు. భయం, నమ్మకం, భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని జరిగే ఇలాంటి ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *