ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)లో అక్రమాలపై మరోసారి చర్చ మొదలైంది. ఫోటో హాజరు, ఈ-కేవైసీ, ఫేషియల్ ఐడెంటిఫికేషన్ వంటి ఆధునిక వ్యవస్థలు అమల్లో ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఫేక్ హాజరు నమోదు చేసి కూలీల డబ్బులు దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కామారెడ్డి జిల్లాలో కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు పని ప్రదేశానికి రాని వ్యక్తులకు కూడా హాజరు నమోదు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వచ్చిన కూలీలతో కుమ్మక్కై వారి పేర్లపై వచ్చిన కూలి డబ్బులను పంచుకుంటున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. దీంతో నిజంగా కష్టపడి పని చేసే కార్మికులకు అన్యాయం జరుగుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు అయిన ఏపీఓలు, ఎంపీడీఓలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు తరచుగా పనుల ప్రాంతాలను తనిఖీ చేయకపోవడం వల్ల ఇలాంటి అక్రమాలకు అవకాశం లభిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఉపాధి హామీ ఫేషియల్ రికగ్నిషన్ యాప్ పనితీరుపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కామటిపల్లెలో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఇటీవల ఆలయ దర్శనం అనంతరం తలనీలాలు సమర్పించడంతో పూర్తిగా గుండు చేయించుకున్నాడు. అనంతరం ఉపాధి హామీ పనులకు వెళ్లి హాజరు నమోదు చేయించుకునే సమయంలో ఫేషియల్ ఐడెంటిఫికేషన్ యాప్ అతని ఫోటోను గుర్తించలేదని సమాచారం. దీంతో పక్కనే ఉన్న మహిళ జుట్టును అతని తలపై కప్పి ఫోటో తీసిన తర్వాత యాప్ హాజరును అంగీకరించినట్లు ప్రచారం జరిగింది.
ఈ ఘటనతో ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ కవళికలు, కళ్ల ఆకృతి, ముక్కు, దవడ నిర్మాణం వంటి అంశాల ఆధారంగా గుర్తింపు జరగాల్సి ఉండగా, జుట్టు లేకపోవడం వల్ల హాజరు నమోదు కాకపోవడం సాంకేతిక లోపమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అయితే ఈ ఘటనపై సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవ పరిస్థితులను వెల్లడించాల్సిన అవసరం ఉందని గ్రామీణ కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఒకవైపు ఫేక్ హాజరు ఆరోపణలు, మరోవైపు ఫేషియల్ ఐడెంటిఫికేషన్ లోపాలపై వచ్చిన ఫిర్యాదులు ఉపాధి హామీ పథకం అమలుపై కొత్త చర్చకు దారితీశాయి.

