కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో చారిత్రక మైలురాయిని అధిగమించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ నిన్నటితో 4,398 రోజులు పూర్తి చేసుకోగా, ఈరోజుతో 4,399 రోజుల పాలనను పూర్తి చేసి దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రధానిగా కొనసాగిన నాయకుల జాబితాలో కీలక స్థానాన్ని సంపాదించారని భారతీయ జనతా పార్టీ నేతలు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి. వివిధ దేవాలయాల్లో పూజలు, అర్చనలు, హారతులు నిర్వహిస్తూ ప్రధాని మోదీకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. తెలంగాణలోని కరీంనగర్లో కూడా ఉదయం నుంచే పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కరీంనగర్ మహాశక్తి ఆలయంలో కుంకుమార్చనలు, ప్రత్యేక హారతులు నిర్వహించి, నరేంద్ర మోదీ దేశానికి మరింత కాలం సేవలందించాలని ఆకాంక్షించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకుడిగా మోదీని కొనియాడుతూ, ఆయనకు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు కలగాలని అమ్మవారిని వేడుకున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, గత ప్రభుత్వాల కాలంలో అవినీతి, అభివృద్ధి లోపాలు కనిపించాయని విమర్శించారు. అయితే గత 12 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అవినీతి రహిత పాలన వైపు అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
జన్ ధన్ ఖాతాల ప్రారంభం, మరుగుదొడ్ల నిర్మాణం, జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, విమానాశ్రయాల నిర్మాణం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి వంటి అనేక రంగాల్లో కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేసిందని చెప్పారు. సమాజంలోని చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరాలనే “అంత్యోదయ” సిద్ధాంతంతో ప్రధాని మోదీ పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ పరిపాలన సాగిస్తున్న నాయకుడు నరేంద్ర మోదీ అని కొనియాడారు. దేశంలో కోట్లాది మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు.
“వికసిత భారత్–2047” లక్ష్యంతో దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని, 2047 వరకు ఆయన నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారని బీజేపీ నేతలు పేర్కొన్నారు.
దేశాన్ని శక్తివంతమైన భారతదేశంగా తీర్చిదిద్దే దిశగా ప్రధాని మోదీ ముందుకు సాగుతున్న ఈ ప్రయాణం విజయవంతం కావాలని, ఆయనకు మరింత శక్తి, సామర్థ్యం, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేశ అభ్యున్నతి కోసం ఆయన సేవలు ఇంకా కొనసాగాలని ఆకాంక్షిస్తూ బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

