యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి ఏర్పాటు.. చైర్మన్‌గా ఎంఎస్‌ఎన్ ఫార్మా అధినేత ఎం. సత్యనారాయణ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలకమండలిని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 18 మంది సభ్యులతో కూడిన ఈ పాలకమండలికి ఎంఎస్‌ఎన్ ఫార్మా అధినేత ఎం. సత్యనారాయణ రెడ్డిని చైర్మన్‌గా నియమించింది. ఈ పాలకమండలి పదవీకాలం రెండేళ్లు ఉంటుంది.

ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, పాలకమండలిలో మొత్తం 18 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 11 మంది వివిధ రంగాలకు చెందిన సభ్యులు కాగా, మరో ఏడుగురు ప్రభుత్వ అధికారులు ఎక్స్‌-అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ నియామకాలు తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలిజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్టంలోని నిబంధనల మేరకు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

పాలకమండలిలో సభ్యురాలిగా కొనిదెల సురేఖకు చోటు కల్పించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రభుత్వం ఈ నియామకాలపై అధికారికంగా ఎలాంటి ప్రత్యేక వివరణ ఇవ్వలేదు. నియామకాలు చట్టబద్ధ నిబంధనల ప్రకారమే జరిగాయని మాత్రమే పేర్కొంది.

ఇదిలా ఉండగా, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో గెస్ట్ హౌసుల నిర్మాణానికి ఆసక్తి చూపుతున్న వారి జాబితాను సిద్ధం చేసి, దశలవారీగా అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్మాణాల్లో తిరుమల నమూనాను అనుసరించాలని సూచించారు.

ఆలయ పరిసర ప్రాంతాల్లో భూసేకరణ కోసం అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్‌తో పాటు ఇతర మఠాలకు మార్కెట్ ధర ప్రకారం భూముల కేటాయింపుపై స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని సూచించారు. కుల సంఘాలకు స్థలాల కేటాయింపునకు కూడా పారదర్శకమైన నిబంధనలు రూపొందించాలని అధికారులకు తెలిపారు.

ఆలయ భూముల యాజమాన్య హక్కులు దేవస్థానం వద్దనే ఉండేలా చర్యలు తీసుకోవాలని, యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణంపై ఇంజినీర్ల కమిటీ సమర్పించిన నివేదికను వారం రోజుల్లో పరిశీలించి నివేదిక అందించాలని సీఎం ఆదేశించారు. అలాగే పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్య (PPP) విధానంలో టూరిజం సర్క్యూట్ అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వి. నరేందర్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్, దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *