మహిళల్లో స్ట్రెస్ ప్రభావం: పీరియడ్స్, హార్మోన్లు, PCOS, థైరాయిడ్‌పై ఎలా ప్రభావం చూపిస్తుంది?

ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ “స్ట్రెస్” అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఈ ఒత్తిడి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఫిడికస్ హోమియోపతి వైద్యురాలు డాక్టర్ తేజస్వి తెలిపారు.

స్ట్రెస్ ఎక్కువ కాలం కొనసాగితే శరీరంలో కార్టిసాల్ (Cortisol) అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయులు పెరుగుతాయి. దీని వల్ల ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, థైరాయిడ్, ప్రోలాక్టిన్ వంటి కీలక హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా మహిళల్లో మొదట కనిపించే లక్షణం పీరియడ్స్‌లో అవకతవకలు.

సాధారణంగా 21 నుంచి 35 రోజుల మధ్య రావాల్సిన పీరియడ్స్ ఆలస్యంగా రావడం, రెండు నుంచి మూడు నెలలకు ఒకసారి మాత్రమే రావడం, బ్లీడింగ్ తక్కువగా ఉండడం లేదా కేవలం స్పాటింగ్ మాత్రమే కనిపించడం వంటి సమస్యలు స్ట్రెస్ కారణంగా రావచ్చు.

హార్మోన్ల అసమతుల్యత ఎక్కువకాలం కొనసాగితే PCOS (పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్), థైరాయిడ్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు, స్ట్రెస్ వల్ల ఇన్సులిన్ పనితీరు కూడా దెబ్బతిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. దీని కారణంగా బరువు వేగంగా పెరగడం, ఊబకాయం రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

అయితే కొంతమందిలో స్ట్రెస్ కారణంగా బరువు తగ్గడం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా హైపర్ థైరాయిడిజం ఉన్నవారిలో మెటబాలిజం వేగంగా పనిచేయడంతో ఎంత తిన్నా బరువు తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది.

అందువల్ల నిరంతరం స్ట్రెస్‌లో ఉండటం మహిళల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని, పీరియడ్స్‌లో మార్పులు, బరువులో అకస్మాత్తుగా మార్పులు లేదా ఇతర హార్మోన్ల సమస్యలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని డాక్టర్ తేజస్వి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *