కరీంనగర్‌లో జరిగిన నగల దుకాణం దోపిడీ ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటనపై బీజేపీ నేత, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ వర్గాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఈ క్రమంలో చీకోటి ప్రవీణ్ బీఆర్‌ఎస్ నేతలపై మండిపడ్డారు.
“జై శ్రీరాం… అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్ నేతలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కరీంనగర్‌లో దోపిడీ జరిగితే కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదం” అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో జరిగిన ఒక దోపిడీ ఘటనకు కేంద్ర మంత్రిని బాధ్యుడిని చేయడం వెనుక రాజకీయ ఉద్దేశ్యమే ఉందన్నారు. “పోలీసు వ్యవస్థను ప్రశ్నించాలి, ఇంటెలిజెన్స్ వైఫల్యంపై మాట్లాడాలి. కానీ బండి సంజయ్ రాజీనామా చేయాలని అడగడం అంటే రాజకీయ అవగాహన లేనట్టే” అని విమర్శించారు.
అలాగే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాల ఉదాహరణలు ప్రస్తావిస్తూ, “ప్రతి ఘటనకు రాజీనామా చేయాలంటే గత 10 ఏళ్లలో కేసీఆర్ ఎన్ని సార్లు రాజీనామా చేయాలి?” అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలను గమనించాలని, అధికారంలో లేకపోవడంతో వారు అసహనంతో మాట్లాడుతున్నారని చీకోటి ప్రవీణ్ అన్నారు. “ముందు మీ ప్రభుత్వ కాలంలో జరిగిన ఘటనలకు సమాధానం చెప్పండి. ఆ తర్వాత బండి సంజయ్ గురించి మాట్లాడండి” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కరీంనగర్ ఘటనపై రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతుండగా, ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరో హాట్ టాపిక్‌గా మారింది.

