హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో తాజాగా ఓ ఆసక్తికర చర్చ జోరుగా సాగుతోంది. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఓ సీనియర్ నేత ఇప్పటికీ ప్రభుత్వ వ్యవహారాలపై ప్రభావం చూపుతున్నారనే ప్రచారం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. దక్షిణ తెలంగాణకు చెందిన ఈ ‘పెద్దాయన’ నుంచి వచ్చే లేఖలు, ఫోన్లకు మంత్రులు సైతం ప్రాధాన్యం ఇస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
2023 తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, సదరు సీనియర్ నేత ఇంటికి ఇప్పటికీ ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నట్లు సమాచారం. తమ సమస్యలు, బదిలీలు, నామినేటెడ్ పదవులు, అభివృద్ధి పనులు, వ్యక్తిగత విజ్ఞప్తులను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారని తెలుస్తోంది. ప్రభుత్వంలో ఆయన మాటకు ఇప్పటికీ విలువ ఉందనే నమ్మకంతోనే చాలా మంది ఆయనను ఆశ్రయిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సమస్యలు విన్న అనంతరం నిబంధనలకు లోబడి పరిష్కరించగల అంశాలైతే సంబంధిత మంత్రులకు తన లెటర్‌ప్యాడ్‌పై సిఫారసు లేఖలు రాస్తున్నారట. ఆ లేఖలు మంత్రుల కార్యాలయాలకు చేరగానే అధికారులు వాటిని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కొందరు మంత్రులు కూడా సీనియర్ నాయకుడి సిఫారసును గౌరవంగా తీసుకుని సాధ్యమైన పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచిస్తున్నట్లు సమాచారం.
అయితే, నిబంధనలకు విరుద్ధంగా లేదా ప్రత్యేకంగా చూడాల్సిన అంశాల విషయంలో మాత్రం సదరు నేత నేరుగా మంత్రులకు ఫోన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. “మనకు బాగా కావాల్సిన వ్యక్తి వస్తాడు… కాస్త చూసి పని చేసి పెట్టండి”, “ట్రాన్స్ఫర్ విషయం ఉంది”, “మనోడికి పోస్టింగ్ అవసరం” అంటూ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారట. అంతేకాదు, పని పూర్తయిందా లేదా అని వారం రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి ఆరా తీస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇదే అంశంపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మంత్రులు మాత్రం ఇంతటి సీనియర్ నాయకుడు తమను సంప్రదించడం గౌరవంగా భావిస్తున్నారట. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను దగ్గరగా చూసిన అనుభవజ్ఞుడు తనపై నమ్మకం ఉంచి ఫోన్ చేశారని సంతోషంగా ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.
అయితే మరికొందరు మంత్రులు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం ఉంది. ప్రతి చిన్న పని విషయంలో ఫోన్ చేసి ప్రశ్నించడం, మళ్లీ పురోగతి గురించి అడగడం వల్ల తమపై పెత్తనం చేస్తున్నారనే భావన కలుగుతోందని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారట. ఉమ్మడి రాష్ట్రంలో అధికారాన్ని అనుభవించిన నాయకులు ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకున్నా కూడా పరోక్షంగా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఎంతవరకు సమంజసమనే చర్చ కూడా జరుగుతోంది.
ఈ నేపథ్యంలో అసలు ఆ ‘పెద్దాయన’ ఎవరనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దక్షిణ తెలంగాణకు చెందిన ఆ సీనియర్ నేతపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, అధికారికంగా మాత్రం ఎలాంటి స్పష్టత లేదు.
ఇక మరోవైపు, ప్రస్తుతం కాంగ్రెస్‌లో సీనియర్ నేతల మాటకు అంత ప్రాధాన్యం లేదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కొందరు సీనియర్లు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయని, పార్టీలో కొత్త తరం నాయకత్వం తమదైన శైలిలో ముందుకు సాగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ మంత్రులను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న ఈ సీనియర్ నేత ఎవరు? అనే ప్రశ్న రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
అయితే ఇవన్నీ ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం, రాజకీయ చర్చలే తప్ప అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. అయినప్పటికీ, కాంగ్రెస్‌లో ఇప్పటికీ కొందరు సీనియర్ల ప్రభావం కొనసాగుతుందా? లేక ఇది కేవలం రాజకీయ గుసగుసలేనా? అన్నది ఆసక్తికరంగా మారింది.

