తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ C. V. Anand రాష్ట్ర భద్రత, పోలీసింగ్, ఫిట్‌నెస్, సైబర్ నేరాలు, డ్రగ్స్ సమస్యలపై తన విజన్‌ను వెల్లడించారు. వెయిట్ న్యూస్ కాన్క్లేవ్ 2026 వేదికగా మాట్లాడిన ఆయన, భవిష్యత్ తెలంగాణ పోలీసింగ్‌కు సంబంధించిన బ్లూప్రింట్‌ను వివరించారు.
కార్యక్రమంలో మాట్లాడిన డీజీపీ సీవీ ఆనంద్, పోలీస్ శాఖలో ఫిట్‌నెస్ అత్యంత కీలకమని పేర్కొన్నారు. “స్ట్రెస్‌ను తట్టుకోవాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. నేను గత 33 ఏళ్లుగా నా బరువును 75-76 కిలోల మధ్యే మెయింటైన్ చేస్తున్నాను” అని తెలిపారు. ఇప్పటికీ లీగ్ క్రికెట్ ఆడుతున్నానని, గత ఏడాది ఐదు సెంచరీలు కూడా సాధించానని చెప్పారు. టెన్నిస్, గాల్ఫ్, వెయిట్ ట్రైనింగ్ తన దైనందిన జీవితంలో భాగమని వెల్లడించారు.
ఆహార నియంత్రణపై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఫోర్ వైట్స్ అంటే షుగర్, సాల్ట్, మైదా, రైస్‌ను చాలా కాలం క్రితమే తగ్గించాను. ముఖ్యంగా అధికంగా బియ్యం తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం” అని పేర్కొన్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సమయంలో ప్రారంభించిన “ఫిట్ కాప్” కార్యక్రమాన్ని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ శాఖలో 75 వేల మంది సిబ్బంది పనిచేస్తుండగా, వారందరికీ హెల్త్ ప్రొఫైలింగ్ చేసి ప్రత్యేక యాప్ ద్వారా ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేయాలని ప్రణాళిక ఉందన్నారు. ఇందుకోసం టెక్నాలజీ, ఎన్జీవోల సహకారంతో ముందుకు వెళ్లనున్నట్టు వెల్లడించారు.
తాను 150 శాతం హైదరాబాదినేనని చెప్పిన సీవీ ఆనంద్, హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగానని, చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు. వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో పనిచేసిన అనుభవం తనకు తెలంగాణ సామాజిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఇచ్చిందన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఎదురవుతున్న ప్రధాన సవాళ్లలో డ్రగ్స్, సైబర్ నేరాలు అత్యంత ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. “నార్కోటిక్స్ ఇప్పుడు సమాజాన్ని పట్టిపీడిస్తున్న పెద్ద సమస్య. ధనికులు, మధ్యతరగతి, గ్రామీణ ప్రాంతాలు అన్న తేడా లేకుండా ప్రతి వర్గానికీ ఇది చేరుతోంది. పిల్లలు బయటకు వెళ్తే సురక్షితంగా తిరిగి వస్తారా అనే భయం తల్లిదండ్రుల్లో ఉంది” అని ఆందోళన వ్యక్తం చేశారు.
సైబర్ నేరాలపై కూడా ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “ఇప్పుడు దోపిడీలు కత్తులతో కాదు, ఫోన్లతో జరుగుతున్నాయి. చాలామంది జీవితాంతం సంపాదించిన డబ్బును నిమిషాల్లో కోల్పోతున్నారు. ఇది హింస లేకుండా జరిగే నేరం” అని వ్యాఖ్యానించారు.
అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు, అర్బనైజేషన్, ప్రకృతి వైపరీత్యాలు కూడా భవిష్యత్ పోలీసింగ్‌కు ప్రధాన సవాళ్లని ఆయన చెప్పారు. సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
“పాత పోలీసింగ్ విధానాలతో కొత్త సవాళ్లను ఎదుర్కోలేం. సెన్సిటైజేషన్, టెక్నాలజీ, అవుట్‌లుక్ మార్పు, స్పెషలైజ్డ్ ట్రైనింగ్‌తో ముందుకు వెళ్లాలి” అని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.

