హైదరాబాద్ నాంపల్లి పరిధిలో అక్రమంగా యాక్టివేటెడ్ సిమ్ కార్డులను విక్రయిస్తున్న ముఠాను సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి మొత్తం 184 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎయిర్‌టెల్‌కు చెందిన 150 సిమ్‌లు, జియోకు చెందిన 34 సిమ్‌లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
సీసీఎస్ డీసీపీ చైతన్య కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఏపీ రాష్ట్రం కడప జిల్లాకు చెందిన నేనావత్ దినేష్ కుమార్ నాయక్ కడపలో లావణ్య ఎంటర్‌ప్రైజెస్ పేరిట సిమ్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మరో నిందితుడు పర్ణపిల్లి సాయి ప్రదీప్, కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందినవాడు కాగా, ఎయిర్‌టెల్ సిమ్ ప్రమోటర్‌గా పని చేస్తున్నాడు.
వీరిద్దరూ తమ షాపులకు సిమ్ కోసం వచ్చే కస్టమర్ల నుంచి ఆధార్ కార్డు, వేలిముద్రల వంటి కేవైసీ వివరాలు తీసుకుని, వారి పేర్లపై ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా సిమ్ కార్డులను యాక్టివేట్ చేసి, అవి అవసరమైన వారికి అధిక ధరకు అక్రమంగా విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.
ఈ సిమ్‌లను హైదరాబాద్ నగరంలో విక్రయించేందుకు నాంపల్లి ప్రాంతానికి వచ్చినట్లు సమాచారం అందడంతో, సీసీఎస్ ఇన్స్పెక్టర్ సిబ్బంది నాంపల్లి పోలీసుల సహకారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో, ఇలాంటి అక్రమ సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లు కొనుగోలు చేసి మోసాలు, సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సిమ్‌లు ఎవరి పేర్లపై ఉంటాయో, నేరం జరిగినప్పుడు మొదటగా వారి పేర్లే బయటపడే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
నిందితులు ఇప్పటివరకు ఎంతమందికి సిమ్ కార్డులు విక్రయించారన్న అంశంపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. అలాగే, సిమ్ కొనుగోలు చేసే సమయంలో ప్రజలు తమ ఆధార్, బయోమెట్రిక్ వివరాలు ఇచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, జెన్యూన్ దుకానాలనే ఎంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

