ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా.. ₹1000 టికెట్ ₹15 వేలకా?

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ఐపీఎల్ మ్యాచ్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. అభిమానులు తమ అభిమాన జట్టును ప్రత్యక్షంగా చూడాలని ఎంతగానో ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఇప్పుడు అదే అభిమానాన్ని కొందరు దందాగా మార్చుకున్నారనే ఆరోపణలు హైదరాబాద్‌లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ఉప్పల్ స్టేడియం వద్ద జరుగుతున్న ఐపీఎల్ టికెట్ల బ్లాక్ మార్కెట్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

వెయ్యి రూపాయల అసలు టికెట్‌ను ఏకంగా 15 వేల రూపాయలకు విక్రయిస్తున్నారనే వార్తలు అభిమానులను షాక్‌కు గురిచేస్తున్నాయి. ఇక 20 వేల రూపాయల విలువైన వీఐపీ టికెట్లు 50 వేల వరకు అమ్ముతున్నారట. మ్యాచ్‌పై ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు ముఠాలు ఈ దందాను నడుపుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో అభిమానులు పెద్ద సంఖ్యలో ఉప్పల్ స్టేడియం వద్దకు చేరుకుంటున్నారు. అయితే అధికారికంగా టికెట్లు దొరకకపోవడంతో బ్లాక్ మార్కెట్ విక్రేతలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. స్టేడియం పరిసరాల్లోనే బహిరంగంగా అధిక ధరలకు టికెట్లు అమ్ముతున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలు ప్రశ్న ఏమిటంటే.. ఒక వ్యక్తి చేతిలో ఇన్ని టికెట్లు ఎలా చేరుతున్నాయి? ఒక్కో వ్యక్తికి పరిమిత సంఖ్యలో మాత్రమే టికెట్లు ఇవ్వాల్సి ఉండగా వందల సంఖ్యలో టికెట్లు బ్లాక్ మార్కెట్‌కు ఎలా వెళ్తున్నాయి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం బయట జరిగే బ్లాక్ మార్కెట్ మాత్రమే కాదు.. అంతర్గతంగా కూడా పెద్ద కుట్ర జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

చాలామంది అభిమానులు ఒకసారి అయినా స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూడాలని కలలు కంటుంటారు. కానీ ఇప్పుడు ఆ కల సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు దూరమవుతోంది. ₹1000 టికెట్ ఉంటే కాస్త ఆలోచించి కొనగలిగే పరిస్థితి ఉంటుంది. కానీ ₹15,000 నుంచి ₹50,000 వరకు ధరలు పెరిగితే సామాన్యుడు ఆలోచించడానికే భయపడే పరిస్థితి ఏర్పడింది.

వాస్తవానికి టీవీలో మ్యాచ్ చూస్తే బాల్ టు బాల్ క్లారిటీగా చూడొచ్చు. కానీ స్టేడియంలో ప్రత్యక్ష అనుభూతి కోసం అభిమానులు వెళ్తుంటారు. అదే భావోద్వేగాన్ని కొందరు వ్యాపారంగా మార్చుకొని భారీగా డబ్బులు దండుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.

ఇక అభిమానుల డిమాండ్‌ను కొందరు ముఠాలు క్యాష్ చేసుకుంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మ్యాచ్‌కు వెళ్లాలనే ఆత్రుతతో కొందరు అభిమానులు అప్పు చేసి అయినా టికెట్లు కొనుగోలు చేస్తున్నారట. ఇదే పరిస్థితిని బ్లాక్ మార్కెట్ నిర్వాహకులు వాడుకుంటున్నారని అంటున్నారు.

మరోవైపు హెచ్సిఏపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభావశీల వ్యక్తుల ఒత్తిడితో టికెట్ల కేటాయింపులో గందరగోళం జరుగుతుందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అభిమానుల బెదిరింపులు, ఒత్తిడులు కూడా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది.

ఏదేమైనా ఐపీఎల్ లాంటి భారీ టోర్నమెంట్‌లో టికెట్ల బ్లాక్ మార్కెట్ వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. అభిమానుల ప్రేమను, క్రేజ్‌ను వ్యాపారంగా మార్చుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రీడాభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరి అధికారులు ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారు? బ్లాక్ మార్కెట్ ముఠాలపై చర్యలు ఉంటాయా? చూడాలి.

మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *