‘ఇడుపు కాయితం’ వివాదం.. తెలంగాణ భాషపై కవిత ఘాటు కౌంటర్
‘ఇడుపు కాయితం’ అనే పదంపై సోషల్ మీడియాలో కొనసాగుతున్న చర్చ రాజకీయ రంగు పులుముకుంది. ఓ నెటిజన్ “ఇడుపు కాయితం సినిమాను తెలుగులో డబ్ చేస్తారా?” అని చేసిన వ్యాఖ్యపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగగా, తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. తెలంగాణ భాష, యాసపై జరుగుతున్న విమర్శలకు ఆమె గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కవిత, “‘ఇడుపు కాయితం’ అనే పదానికి అసలు అర్థం తెలుసుకోవాలంటే మా పెద్దాయన కేసీఆర్‌ను అడిగితే బాగా చెబుతారు. తెలంగాణ భాషలోని ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది. అర్థం తెలియకుండా విమర్శించడం సరికాదు” అని వ్యాఖ్యానించారు.
అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా రోజులుగా ప్రజల్లోకి రాలేదని, ఆయన ప్రసంగాలు వినక చాలా రోజులైందని అన్నారు. “కేసీఆర్ గురించి మాట్లాడకుండా కొందరికి నిద్ర పట్టదు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా ఉండలేరనే పరిస్థితి ఉంది” అంటూ సెటైర్లు వేశారు.
తెలంగాణ భాషను ప్రత్యేకంగా చూపిస్తూ దానిని తెలుగుకు భిన్నంగా చూపించే ప్రయత్నాలను కవిత తప్పుబట్టారు. “తెలంగాణ భాష కూడా తెలుగే. రాయలసీమ యాస, గోదావరి జిల్లాల యాస, శ్రీకాకుళం యాస ఎలా తెలుగులో భాగమో, తెలంగాణ యాస కూడా అలాగే తెలుగులో భాగమే. భాష ఒక్కటే.. యాస మాత్రమే ప్రాంతాన్ని బట్టి మారుతుంది” అని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రముఖ అవధాని గరికపాటి నరసింహారావు గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా కవిత గుర్తు చేశారు. తెలంగాణ భాష గ్రాంధిక తెలుగు భాషకు అత్యంత దగ్గరగా ఉండే శాస్త్రీయమైన భాష అని గరికపాటి చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, “తెలంగాణ భాష శాస్త్రీయమైనదని, గ్రాంధిక భాషకు దగ్గరగా ఉంటుందని గరికపాటి గారే చెప్పారు. ఆ వ్యాఖ్యలను కూడా గుర్తు పెట్టుకోవాలి” అన్నారు.
‘ఇడుపు కాయితం’ అనే పదానికి “ఒప్పంద పత్రం” లేదా “అగ్రిమెంట్” అనే అర్థం వస్తుందని కవిత వివరించారు. పదాల అర్థం తెలియకుండా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.
తెలంగాణ యాస, సంస్కృతిపై ఎలాంటి విమర్శలు వచ్చినా వాటికి తాము సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని కవిత స్పష్టం చేశారు. భాషను ప్రాంతాల ఆధారంగా విభజించకుండా, తెలుగు భాషలోని అన్ని యాసలను సమానంగా గౌరవించాలని ఆమె కోరారు.
ఇటీవల ‘ఇడుపు కాయితం’ అనే పదం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలంగాణ యాస, భాషపై మరోసారి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.

