నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. అప్పు చేస్తే చంపేస్తారు.. డబ్బులు తిరిగి అడిగితే ప్రాణాలే తీసేస్తారు. హైదరాబాద్ శివారులో బయటపడిన ఈ దారుణ ఘటన ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మొయినాబాద్ ఫార్మ్ హౌస్‌లో జరిగిన జంట హత్యల కేసులో బయటపడుతున్న విషయాలు వింటే గుండెల్లో వణుకు పుడుతోంది. అప్పు ఇచ్చి ఆదుకున్న మహిళలనే టార్గెట్ చేసి వరుస హత్యలకు ప్లాన్ వేసిన కరీమాబి దంపతుల క్రూరత్వం ఇప్పుడు అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.
హైదరాబాద్‌కు సమీపంలోని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ ఫార్మ్ హౌస్‌లో కొద్ది రోజుల క్రితం ఇద్దరు మహిళల మృతదేహాలు బయటపడటంతో కలకలం రేగింది. మృతులు వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన మహిళలుగా పోలీసులు గుర్తించారు.
వీరు తాండూరు నుంచి మొయినాబాద్ ఫార్మ్ హౌస్‌కు ఎందుకు వచ్చారు? వీరిని ఎవరు హత్య చేశారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా కథ ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసు వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ తాండూరుకు చెందిన కరీమాబి మరియు ఆమె భర్త అని పోలీసులు గుర్తించారు.
విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ ఈ దంపతులు తెలిసినవాళ్లు, నమ్మకస్తుల దగ్గర లక్షల రూపాయల అప్పులు చేశారు. ముఖ్యంగా తాండూరు పరిసర ప్రాంతాల్లో దాదాపు ఎనిమిది మంది మహిళల దగ్గర భారీగా డబ్బులు తీసుకున్నట్లు సమాచారం.
రోజులు గడుస్తున్న కొద్దీ అప్పు ఇచ్చినవాళ్లు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఈరోజు ఇస్తాం, రేపు ఇస్తాం అంటూ కాలయాపన చేసిన కరీమాబి దంపతులు చివరకు దారుణ నిర్ణయం తీసుకున్నారు. “అప్పులు తీర్చడం కష్టం.. అడిగేవాళ్లే లేకపోతే సమస్యే ఉండదు” అని ఫిక్స్ అయ్యారని పోలీసులు చెబుతున్నారు.
ఇందులో భాగంగానే అప్పు ఇచ్చిన ఎనిమిది మందిని వరుసగా చంపేయాలని స్కెచ్ వేశారు. మొయినాబాద్‌లోని ఓ ఫార్మ్ హౌస్‌ను ఇందుకు కేంద్రంగా మార్చుకున్నారు. ముందుగా తాండూరుకు చెందిన ఇద్దరు మహిళలకు ఫోన్ చేసి “మీ డబ్బులు సిద్ధంగా ఉన్నాయి.. ఎవరికీ చెప్పకుండా ఫార్మ్ హౌస్‌కు రండి.. అక్కడ సెటిల్ చేస్తాం” అంటూ నమ్మబలికారు.
తమ డబ్బులు తిరిగి వస్తాయని ఆశతో వెళ్లిన ఆ ఇద్దరు మహిళలను కరీమాబి దంపతులు అత్యంత క్రూరంగా హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అనంతరం శవాలను అక్కడే పడేసి ఏమి తెలియనట్టు మళ్లీ తాండూరుకు వెళ్లిపోయారు.
ఇద్దరి హత్యల తర్వాత మిగిలిన మరో ఆరుగురిని కూడా ఇదే విధంగా చంపేయాలని ప్లాన్ చేశారు. మళ్లీ అదే ఫార్మ్ హౌస్‌కు రమ్మంటూ ఆ మహిళలకు ఫోన్లు చేశారు. అయితే ఇక్కడే నిందితుల ప్లాన్ రివర్స్ అయింది.
ఇప్పటికే కరీమాబితో కలిసి వెళ్లిన ఇద్దరు మహిళలు కనిపించకుండా పోవడం, వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడం, అదే సమయంలో తమను కూడా రహస్యంగా ఫార్మ్ హౌస్‌కు రమ్మని పిలవడంతో మిగిలిన ఆరుగురు మహిళలకు అనుమానం వచ్చింది. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించి “కరీమాబి నుంచి మాకు ప్రాణహాని ఉంది” అంటూ ఫిర్యాదు చేశారు.
మహిళల ఫిర్యాదుతో అలర్ట్ అయిన పోలీసులు కరీమాబి దంపతులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో బయటపడిన విషయాలు విని పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఇప్పటికే ఇద్దరిని హత్య చేశామని, మిగిలిన ఆరుగురిని కూడా చంపేందుకు ప్లాన్ చేశామని నిందితులు ఒప్పుకున్నట్లు సమాచారం.

