రేవంత్ టార్గెట్ టీడీపీ ఓట్ బ్యాంకేనా? ఎన్టీఆర్ విగ్రహం వెనుక రాజకీయ వ్యూహంపై చర్చ

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం వేడెక్కింది. వ్యవసాయానికి ప్రస్తుతం అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసేందుకే ప్రత్యేక రైతు డిస్కాం ఏర్పాటు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 420 హామీలన్నీ అమలు చేసిన తర్వాతే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాలని సవాల్ విసిరారు.

ఆదివారం కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, రైతు డిస్కాం పేరుతో రైతులకు అందుతున్న ఉచిత విద్యుత్‌పై భవిష్యత్తులో కోత విధించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. రైతుల ప్రయోజనాల పేరుతో కొత్త వ్యవస్థను తీసుకురావడం వెనుక అసలు ఉద్దేశం ఉచిత కరెంట్‌ను క్రమంగా తగ్గించడమేనని ఆయన అన్నారు.

ఎన్టీఆర్ విగ్రహం వెనుక రాజకీయ వ్యూహమా?

ఇదిలా ఉండగా హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన సీనియర్ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ రాజకీయ చర్చలకు కేంద్రబిందువుగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరు కావడం వెనుక రాజకీయ లెక్కలు ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

ఇటీవల జరిగిన టిడిపి మహానాడులో తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేస్తామని నారా లోకేష్ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ అప్రమత్తమైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. టిడిపి సంప్రదాయ ఓటు బ్యాంకును తమ వైపు మళ్లించుకోవాలనే వ్యూహంలో భాగంగానే ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇచ్చిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో స్థిరపడిన సెటిలర్లు, టిడిపి సానుభూతిపరులు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను ఆకర్షించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడిందనే వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

టిడిపి ఓట్ బ్యాంక్‌ను ఆకర్షించే ప్రయత్నమా?

రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం టిడిపి నుంచే ప్రారంభమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌లో చేరి ఎంపీగా, అనంతరం ముఖ్యమంత్రిగా ఎదిగారు. అయితే ఇప్పటికీ చంద్రబాబుతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విమర్శలు తరచూ వినిపిస్తుంటాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణలో టిడిపి మళ్లీ యాక్టివ్ కావాలని భావిస్తున్న సమయంలో, ఆ పార్టీ సానుభూతిపరులను కాంగ్రెస్ వైపు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సెటిలర్ల ఓటు బ్యాంకు భవిష్యత్ ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఒక్క విగ్రహంతో ఓటు బ్యాంకు మారుతుందా?

అయితే రాజకీయ విశ్లేషకులలో మరో వర్గం మాత్రం విభిన్న అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కేవలం ఒక విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల మొత్తం ఓటు బ్యాంకు మారిపోతుందనుకోవడం సరికాదని వారు చెబుతున్నారు.

నేటి ఓటర్ల ఆలోచనా విధానం గతంతో పోలిస్తే పూర్తిగా మారిపోయిందని, ఎన్నికల రోజు వరకు కూడా ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తారో అంచనా వేయడం కష్టంగా మారిందని పేర్కొంటున్నారు. సర్వే సంస్థలు సైతం ప్రజల నాడిని పూర్తిగా అంచనా వేయలేకపోతున్న పరిస్థితి కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు.

ప్రజలు ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను బట్టి నిర్ణయం తీసుకుంటారని, కేవలం విగ్రహాలు లేదా ప్రతీకాత్మక కార్యక్రమాల ఆధారంగా ఓటింగ్ తీరు మారదని అభిప్రాయపడుతున్నారు.

రానున్న ఎన్నికలపై ప్రభావం?

టిడిపి భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీతో కలిసి స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు లేదా అసెంబ్లీ ఎన్నికల్లో చురుకుగా పాల్గొంటే కాంగ్రెస్‌కు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టిడిపి సానుభూతిపరులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ప్రచారం సాగుతోంది.

అయితే చివరికి ప్రజల తీర్పును నిర్ణయించేది ప్రభుత్వ పనితీరే తప్ప రాజకీయ ప్రతీకలు కాదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో టిడిపి, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *