లస్కర్ బోనాలు వైభవం.. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లస్కర్ బోనాలు ఈసారి అంగరంగ వైభవంగా జరిగాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఫలహార బండ్ల ఊరేగింపులు, పోతరాజుల విన్యాసాలు, సంప్రదాయ కళారూపాలతో ఆలయ పరిసరాలు భక్తి శోభతో కళకళలాడాయి.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సీతక్క, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, పవన్ కల్యాణ్, ఎమ్మెల్యే కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, సీహెచ్ మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నవీన్ యాదవ్, ఎమ్మెల్సీ భోగారపు దయానంద్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రభుత్వ సలహాదారులు వీ. హనుమంతరావు, హర్కార వేణుగోపాల్ తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ ఏడాది రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు నాయకులు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బోనాల జాతరకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని పేర్కొన్నారు.

అయితే బోనాల సందర్భంగా జోగినీలు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేటాయించిన సమయానికి ఆలయానికి వచ్చినప్పటికీ తోపులాట జరిగిందని, తాము తీసుకొచ్చిన ఒడిబియ్యం కిందపడిపోయిందని జోగిని శ్యామల ఆవేదన వ్యక్తం చేస్తూ స్పృహ తప్పి పడిపోయారు. మరో జోగిని నిషా క్రాంతి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సోమవారం కూడా జోగినీలు ఆలయం ముందు నిరసన చేపట్టి తమకు జరిగిన అవమానంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బోనాల ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తన అధికారిక నివాసంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, లక్ష్మణ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. విందు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *