తెలంగాణలో మైనింగ్ మాఫియా దందా.. వేల కోట్ల అక్రమాలపై సంచలన ఆరోపణలు

తెలంగాణలో మైనింగ్ మాఫియా దందాపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని మైనింగ్ శాఖ ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. గ్రానైట్, ఇసుక, క్వార్జ్ అక్రమ తవ్వకాలు, నకిలీ వేబిల్లులు, తప్పుడు నివేదికలతో భారీ స్థాయిలో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రముఖ గ్రానైట్ క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా వేల టన్నుల గ్రానైట్ అక్రమ రవాణా జరిగినట్లు మైనింగ్ శాఖ గుర్తించినట్లు తెలుస్తోంది. అదే విధంగా పాలమూరు ప్రాంతంలో విలువైన క్వార్జ్ ను నాణ్యత లేనిదిగా చూపించి భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం.

ఇక సిరిసిల్ల మానేరు పరిసరాల్లో జరిగిన ఇసుక దందా అయితే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రతి రోజు వందల టిప్పర్ల ఇసుకను నకిలీ వేబిల్లులతో హైదరాబాద్, బెంగళూరు మార్కెట్లకు తరలించి వందల కోట్ల లూటీ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే పర్మిట్ పై పలుమార్లు ఇసుక తరలించినట్లు మైనింగ్ శాఖ ప్రాథమిక నివేదికల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా గతంలో ఈ అక్రమ తవ్వకాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతించిన పరిమితికి మించి భారీ యంత్రాలతో నదీ గర్భాన్ని లోతుగా తవ్వడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయాయని, బావులు ఎండిపోయాయని నివేదికల్లో ప్రస్తావన వచ్చినట్లు చెబుతున్నారు.

ఈ వ్యవహారంలో అప్పటి అధికార పార్టీకి చెందిన కీలక నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మైనింగ్ అక్రమాల వెనుక రాజకీయ అండ ఉందనే ఆరోపణలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వ హయాంలో కూడా అక్రమ మైనింగ్ ఆగలేదని విమర్శలు వస్తున్నాయి.

ప్రత్యేకంగా కరీంనగర్ ప్రాంతంలో కొందరు నాయకులు “షాడో ఎమ్మెల్యేలు” పేరుతో మైనింగ్ వ్యవహారాలు నడుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష నాయకులు కలిసి వాటాలు పంచుకుంటూ అక్రమ తవ్వకాలకు సహకరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అసలు ఎమ్మెల్యే కంటే షాడో ఎమ్మెల్యేల ప్రభావమే ఎక్కువగా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రజలు ఎన్నో ఆశలతో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అభివృద్ధిపై కాకుండా అక్రమ సంపాదనలపై దృష్టి పెడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఏసీబీ, మైనింగ్ శాఖ కొన్ని అక్రమాలను వెలికితీస్తున్నప్పటికీ చివరికి రాజకీయ ఒత్తిళ్లతో కేసులు నెమ్మదిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. అధికారులు ఎంత కష్టపడి విచారణ చేసినా చివరికి పెద్దల వద్దే ఫైళ్లు ఆగిపోతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మొత్తానికి తెలంగాణలో మైనింగ్ మాఫియా వ్యవహారం మరోసారి రాజకీయంగా దుమారం రేపుతోంది. గత ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలతో పాటు ప్రస్తుతం కూడా అక్రమాలు కొనసాగుతున్నాయనే విమర్శలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *