యుద్ధం ముగిసిందనే వార్త ప్రపంచవ్యాప్తంగా ఊరటనిచ్చింది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో కొంతకాలంగా ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిన హార్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ పరిణామం భారతదేశంలోని సామాన్య ప్రజలకు వెంటనే ఉపశమనం కలిగిస్తుందా అంటే సమాధానం మాత్రం అంత సులభంగా కనిపించడం లేదు.
యుద్ధాన్ని కారణంగా చూపుతూ గత రెండు మూడు నెలల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్, కమర్షియల్ సిలిండర్లు, నిత్యావసర వస్తువులు, ఇతర వినియోగ వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ఒక మధ్యతరగతి కుటుంబం నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు సంపాదించినా జీవనం గడపడం కష్టంగా మారింది. గతంలో రూ.10 వేలతో సరిపడే కుటుంబ ఖర్చులు ఇప్పుడు రూ.15 వేలకు చేరుకున్నాయి. రూ.15 వేల బడ్జెట్ రూ.20 వేలకు పెరిగింది. ప్రతి కుటుంబంపై నెలకు అదనంగా రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు భారం పడుతోంది.
శాంతి ఒప్పందం అనంతరం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు దాదాపు 4 శాతం తగ్గి 84 డాలర్లకు చేరింది. కానీ ఇది భారత మార్కెట్లో వెంటనే ప్రభావం చూపే అవకాశం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముడి చమురు ధర బ్యారెల్‌కు 80 డాలర్ల కంటే దిగువకు వచ్చి కొంతకాలం స్థిరంగా ఉంటేనే పెట్రోల్, డీజిల్ ధరల్లో చెప్పుకోదగ్గ తగ్గింపు ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
యుద్ధ సమయంలో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు రోజుకు వందల కోట్ల రూపాయల నష్టాలను చవిచూశాయి. ఆ నష్టాలను భర్తీ చేసుకునే వరకు ధరలను తగ్గించే విషయంలో అవి జాగ్రత్తగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ధరలు తగ్గించినా లీటరుకు రూ.2 నుంచి రూ.4 వరకు మాత్రమే తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఎల్పీజీ సిలిండర్ల విషయంలోనూ పూర్తి స్థాయిలో ఉపశమనం కనిపించడం లేదు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు 46 శాతం వరకు పెరగడంతో దేశీయంగా ఒక సిలిండర్ సరఫరా ఖర్చు రూ.1600 దాటిందని చమురు సంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రతి సిలిండర్‌పై రూ.380 నుంచి రూ.600 వరకు నష్టాన్ని భరిస్తున్నామని పేర్కొంటున్నాయి. అందువల్ల ఈ నష్టాలను పూడ్చుకున్న తర్వాతే ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక ద్రవ్యోల్బణం కూడా సామాన్యుడిని మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా ఇంధనం, ఆహార పదార్థాలు, రసాయన ఉత్పత్తులు, లోహాల ధరలు పెరిగాయి. దీంతో తయారీ రంగంపై భారం పెరిగి, చివరకు ఆ ప్రభావం వినియోగదారులపై పడుతోంది.
అయితే ప్రజల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. యుద్ధాన్ని కారణంగా చూపించి ధరలు పెంచిన ప్రభుత్వం, వ్యాపార వర్గాలు ఇప్పుడు యుద్ధం ముగిసిన తర్వాత కూడా ధరలు తగ్గించకపోవడంపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి పెరిగిన ధరలు మళ్లీ పాత స్థాయికి రావడం లేదనే భావన బలపడుతోంది.
సామాన్యుడు, మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి రోజు రోజుకీ దయనీయంగా మారుతోంది. తక్కువ ఆదాయంతో కుటుంబాలను నెట్టుకొస్తున్న వారు పెరిగిన ధరలతో తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ప్రజల జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని, ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
యుద్ధం ముగియడం శుభపరిణామమే అయినప్పటికీ, ధరల భారం తగ్గకపోతే సామాన్యుడి జీవితంలో అసలు మార్పు రాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కనిపిస్తున్న సంకేతాల ప్రకారం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్లో భారీ తగ్గింపు వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో సామాన్యుడి ఎదురుచూపులు మరికొంత కాలం కొనసాగాల్సిందే.

