మైక్రో ఫైనాన్స్ పేరుతో భారీ మోసం?.. గిరిజనుల నుంచి వందల కోట్లు వసూలు చేసినట్టు రమావత్ మధు టీంపై ఆరోపణలు

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో మైక్రో ఫైనాన్స్, అధిక వడ్డీ పేరుతో భారీ మోసం జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పీఏపల్లి మండలం పలుగు తాండాకు చెందిన రమావత్ మధు మరియు అతని టీం గిరిజనులను, ముఖ్యంగా లంబాడీ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలు బాధితుల నుంచి వినిపిస్తున్నాయి.

ఆరు నెలల క్రితం అరెస్టై జైలుకు వెళ్లిన రమావత్ బాలాజీ నాయక్ వద్ద మధు కారు డ్రైవర్‌గా పని చేసినట్టు సమాచారం. బాలాజీ నాయక్ అధిక వడ్డీ ఆశ చూపించి గిరిజనుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, అదే తరహాలో మధు కూడా మైక్రో ఫైనాన్స్ పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు ఇప్పిస్తామని చెప్పి ప్రజల నుంచి కోట్ల రూపాయలు సేకరించినట్టు తెలుస్తోంది.

సింగర్ మంగ్లీ పేరును ఉపయోగిస్తూ 10 నుంచి 15 శాతం వరకు నెలవారీ వడ్డీ ఇస్తామని నమ్మబలికి డబ్బులు తీసుకున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. “రూ.10 లక్షలు ఇస్తే ప్రతి నెల రూ.1 లక్ష ఫోన్‌పే ద్వారా చెల్లిస్తాం” అంటూ గిరిజనులను నమ్మించారని తెలుస్తోంది. దీంతో చాలామంది తమ బంధువులు, స్నేహితుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తీసుకుని మధు టీంకు డబ్బులు ఇచ్చినట్టు సమాచారం.

మొదట్లో కొంతకాలం వడ్డీలు చెల్లించిన మధు టీం, ఆ తర్వాత చెల్లింపులు నిలిపివేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటికే దాదాపు 400 మంది బాధితులు గుడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. బాధితులు తమ వద్ద ఉన్న ప్రామిసరీ నోట్లు, లావాదేవీల ఆధారాలను పోలీసులకు సమర్పించినట్టు సమాచారం.

దేవరకొండ పరిసర ప్రాంతాల్లోని గల్పమట్టి తాండా, పుట్టంగడ్డి, నక్కలపెంట, చింతల తాండా, పిల్లిగుంట తాండా, ఎర్రగుంట తాండా, మునవ తాండా, తిరుమలగిరి, అంగడిపేట, పెద్దగట్టు తదితర గ్రామాల్లో వందలాది మంది ఈ మోసానికి గురైనట్టు తెలుస్తోంది. ఒక్కో కుటుంబం నుంచి రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి.

మరోవైపు, ఈ వ్యవహారంలో సింగర్ మంగ్లీ పేరు కూడా చర్చనీయాంశంగా మారింది. మధుతో ఆమెకు పరిచయం ఏర్పడిన తర్వాత, ఆమె పేరును ఉపయోగించి ప్రజల్లో నమ్మకం పెంచుకుని డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే మంగ్లీకి ఈ వ్యవహారం గురించి పూర్తి అవగాహన ఉందా లేదా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.

మధు తన కొత్త ఇంటి వద్ద మంగ్లీతో తీసుకున్న ఫోటోలు, ఆమె ఇంటి కొనుగోలు అడ్వాన్స్ పేరుతో జరిగిన బ్యాంక్ లావాదేవీలు ప్రస్తుతం చర్చకు దారితీశాయి. అయితే ఈ లావాదేవీలు నిజంగా వ్యాపార సంబంధితవేనా, లేక మోసానికి భాగమా అన్నది విచారణలో స్పష్టత రావాల్సి ఉంది.

ఇప్పటికే ఈ మోసం కారణంగా కొందరు బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు సమాచారం. అప్పులు తీర్చలేక, మానసిక ఒత్తిడితో మరికొందరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఈ కేసుపై పీఏపల్లి–కొండమల్లెపల్లి సీఐ స్పందిస్తూ, కేసు ప్రస్తుతం సీఐడీ దర్యాప్తులో ఉందని తెలిపారు. ఇప్పటివరకు వందలాది మంది బాధితులు ముందుకు వచ్చారని, మరో 210 మంది బాధితులు కూడా ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. కొందరు రూ.15 లక్షల నుంచి రూ.7 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్టు విచారణలో బయటపడుతోందని తెలిపారు.

ఈ కేసులో అసలు మోసం ఎంత మేర జరిగిందో, ఇందులో ఎవరి ప్రమేయం ఎంతవరకు ఉందో దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *