కేబీఆర్ పార్క్ చెట్ల నరికివేతపై సుప్రీం స్టే.. ఎకో సెన్సిటివ్ జోన్‌లో కీలక ఆదేశాలు

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేత వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో చెట్ల తొలగింపుపై అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల 25 నుంచి 35 మీటర్ల పరిధిలో ఉన్న చెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నరకరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

కాజల్ మహేశ్వరి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ మేరకు స్టే ఇచ్చింది. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాలు అత్యంత సున్నితమైన ఎకో జోన్‌గా ఉన్నాయని, ఇక్కడ చెట్ల నరికివేతను తీవ్రంగా పరిగణిస్తామని కోర్టు హెచ్చరించింది.

ఇటీవల కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఫ్లైఓవర్లు, రహదారి విస్తరణ పనుల పేరుతో చెట్లను తొలగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై యువత పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. “సేవ్ కేబీఆర్” పేరుతో పలువురు యువకులు ఉద్యమం చేస్తూ చెట్లను కాపాడాలని డిమాండ్ చేశారు.

అయితే నిరసనలు వ్యక్తం చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడం, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో అరెస్టులు చేయడం వివాదాస్పదమైంది. అర్ధరాత్రి వేళల్లో కూడా చెట్లను తొలగించే ప్రయత్నాలు జరిగాయని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు.

పర్యావరణ పరిరక్షణ కోసం యువత ముందుకు రావడం అభినందించాల్సిన విషయమని పర్యావరణ వేత్తలు అంటున్నారు. చెట్లు నరకొద్దని చెబుతున్న వారితో చర్చలు జరపాల్సింది పోయి కేసులు పెట్టడం సరైంది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు.

హైదరాబాద్‌లో ఇప్పటికే కాలుష్యం తీవ్రస్థాయికి చేరుతోందని, గ్రీన్ కవర్ తగ్గిపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెట్లను పెంచడానికి సంవత్సరాలు పడుతుంటే, నరికివేయడానికి కేవలం కొన్ని నిమిషాలే సరిపోతాయని పర్యావరణ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

“చెట్లు నాటండి, ప్రకృతిని కాపాడండి” అనే సందేశాన్ని ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని ఉద్యమకారులు చెబుతున్నారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు జోక్యంతో చెట్ల నరికివేతపై తాత్కాలికంగా బ్రేక్ పడగా, తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *