నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం తెలంగాణలో కొత్త తరహా సైబర్ మోసాలు బయటపడుతున్నాయి. ఈసారి సాధారణ ప్రజలనే కాదు నేరుగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులనే టార్గెట్ చేస్తూ మోసగాళ్లు రంగంలోకి దిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ పథకాల పేరుతో ఫేక్ కాల్స్ చేసి ఆధార్ వివరాలు, డబ్బులు దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తాజాగా ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది.
నిన్న సాయంత్రం ఒక నెంబర్ నుంచి కాల్ వచ్చిందని, ఆ వ్యక్తి తనను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రటరీ దిలీప్ కుమార్ అంటూ పరిచయం చేసుకున్నాడని ఒక ప్రజాప్రతినిధి వెల్లడించారు. “వికసిత్ భారత్” స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం, అలాగే ముఖ్యమంత్రి ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద యువతకు రూ.10 లక్షల వరకు లోన్లు, 50 శాతం సబ్సిడీ ఇస్తున్నామని చెప్పాడని తెలిపారు.
ఆ వ్యక్తి మాట్లాడుతూ “మీరు ఎందుకు అప్లై చేయలేదు? మీరు ఈ స్కీమ్‌కు అర్హులు. ఈరోజే ఆధార్ కార్డు డిటైల్స్ పంపాలి. ఇవాళ్టితో స్కీమ్ క్లోజ్ అవుతుంది” అంటూ ఒత్తిడి తీసుకొచ్చినట్లు చెప్పారు. మొదట నిజమేనని భావించినా, తరువాత మాటల్లో అనుమానం రావడంతో సంబంధిత అధికారులను సంప్రదించగా అసలు అలాంటి స్కీమ్ లేదని తెలిసిందని వెల్లడించారు.
తర్వాత భట్టి విక్రమార్క కార్యాలయ సిబ్బందిని సంప్రదించగా, అలాంటి అధికారి లేరని, ఆ పేరుతో ఎలాంటి స్కీమ్ ప్రస్తుతం అమల్లో లేదని స్పష్టత ఇచ్చారని చెప్పారు. దీంతో ఇది పూర్తిగా ఫేక్ కాల్ అని అర్థమైందన్నారు.
ఇలాంటి మోసాల్లో మొదట ఆధార్ కార్డు, వ్యక్తిగత వివరాలు తీసుకొని, తరువాత “ప్రాసెసింగ్ ఫీజు”, “రిజిస్ట్రేషన్ ఫీజు”, “సబ్సిడీ యాక్టివేషన్” పేర్లతో రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసే ప్రయత్నం జరుగుతుందని హెచ్చరించారు. చాలా మంది ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గ యువతకు సహాయం చేయాలనే ఉద్దేశంతో వెంటనే స్పందించే అవకాశం ఉండటంతో మోసగాళ్లు వారినే టార్గెట్ చేస్తున్నారని తెలిపారు.
ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఇలాంటి ఫోన్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులమంటూ ఫోన్ చేసి ఆధార్, బ్యాంక్ వివరాలు అడిగితే వెంటనే నమ్మకూడదని, ముందుగా అధికారికంగా ధృవీకరించుకోవాలని హెచ్చరించారు.
అంతేకాదు, ఈ ఫోన్ నెంబర్, వాయిస్ రికార్డులను సైబర్ క్రైమ్ అధికారులకు అందజేస్తామని, ఇప్పటికే ఎంతమందిని మోసం చేశారో దర్యాప్తు చేయాలని కోరారు. ఇలాంటి మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకొని జైలుకు పంపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రోజురోజుకూ సైబర్ నేరాలు కొత్త రూపాలు దాలుస్తున్న నేపథ్యంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు

