కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar కుమారుడు Sai Bhageerath పై నమోదైన పోక్సో కేసు తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులపై తన నిర్ణయాన్ని నేటికి వాయిదా వేసింది.
శుక్రవారం హైకోర్టు వెలువరించే తీర్పుపైనే ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తుందా? లేక పోలీసులకు అరెస్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అన్న ఉత్కంఠ నెలకొంది.
ఈ కేసులో కీలక అంశంగా బాధితురాలి వయస్సు మారింది. అమ్మాయి వయస్సును నిర్ధారించే పత్రాలను పరిశీలించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. బాలికకు సంబంధించిన పుట్టిన తేదీ సర్టిఫికెట్లు, ఇతర అధికారిక రికార్డులను పరిశీలించి పూర్తి నివేదిక ఇవ్వాలని సూచించింది.
ఇక కేసు దర్యాప్తు తీరుపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఒక సామాన్య వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు వచ్చినా ఇదే విధంగా వ్యవహరిస్తారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పోలీసుల విచారణకు హాజరు కావడానికి సమయం కోరడం, ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడం, మరోవైపు కేసుకు సంబంధించిన సమాచారాన్ని కొంత మీడియాకు చేరవేయడం వంటి అంశాలు వివాదాస్పదంగా మారాయి.
బాధితురాలు ఇప్పటికే రెండు సార్లు విచారణకు హాజరై వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. అయితే భగీరథ్ మాత్రం ఇప్పటివరకు ప్రత్యక్షంగా విచారణకు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉంటే కొన్ని మీడియా వేదికల్లో బాధితురాలి ఫోటోలు, వ్యక్తిగత వివరాలు బయటకు రావడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పోక్సో చట్టం ప్రకారం మైనర్ బాధితుల గోప్యత కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని న్యాయ నిపుణులు గుర్తుచేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఈ కేసు హాట్ టాపిక్‌గా మారింది. కోర్టు తీర్పు తర్వాత కేసు దిశ పూర్తిగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

