కాంగ్రెస్ పోవాలే.. కేసీఆర్ రావాలే: మహేశ్వరం సభలో కేటీఆర్ విమర్శలు
మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సభకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, వారి ఉత్సాహం చూస్తుంటే 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయని అన్నారు.
“తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి ‘కాంగ్రెస్ పోవాలే.. కేసీఆర్ రావాలే’ అనే నినాదం వినిపిస్తోంది. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగింది” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తూ, మహేశ్వరం ప్రాంతానికి చెందిన అమరుడు సిరిపురం యాదయ్య త్యాగాన్ని స్మరించారు. ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన యువత ఆశయాలను కేసీఆర్ నాయకత్వంలో నెరవేర్చామని, తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిపామని చెప్పారు.
కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని పేర్కొన్న కేటీఆర్, పదేళ్లలో సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ప్రభుత్వం పనిచేసిందన్నారు. కేసీఆర్కు పదవులు కొత్త కాదని, ఆయన రాజకీయ జీవితమంతా తెలంగాణ ప్రజల కోసమే అంకితం చేశారని తెలిపారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రైతులకు ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సాయం, రూ.4 వేల పెన్షన్, రుణమాఫీ, ఇతర సంక్షేమ పథకాలపై ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు.
రాష్ట్రంలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని, ఎరువుల సరఫరాలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. యూరియా పంపిణీ కోసం తీసుకొచ్చిన యాప్లో కూడా కొన్ని జిల్లాల వివరాలు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.
కాంగ్రెస్ ఎన్నికల సమయంలో పంపిణీ చేసిన గ్యారంటీ కార్డులను ప్రస్తావిస్తూ, ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.2.5 లక్షల లబ్ధి కల్పిస్తామని చెప్పినా ఆ హామీలు అమలు కాలేదని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ను తిరిగి అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన కేటీఆర్, ప్రజల మద్దతుతో గులాబీ జెండా మళ్లీ తెలంగాణలో ఎగురుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

