నైనీ బొగ్గు టెండర్లు ఢిల్లీకి: కాంగ్రెస్ పెద్దల వద్దకు చేరిన సూట్‌కేసుల పంచాయతీ?

తెలంగాణ రాజకీయాల్లో నైనీ బొగ్గు గనుల టెండర్ల వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ వరకు చేరడం రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నైనీ బొగ్గు బావుల టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, స్థానిక కాంగ్రెస్ నేతలు జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేయడంతో ఈ అంశం హస్తిన దాకా వెళ్లింది.

ఈ పరిణామాల నేపథ్యంలో పీసీసీ చీఫ్ కేసీ వేణుగోపాల్‌తో భేటీ కోసం సోమవారం ఢిల్లీకి వెళ్లారు. పార్టీ సంస్థాగత నియమకాలు, మున్సిపల్ ఎన్నికల సన్నాహాలు, అలాగే నైనీ బొగ్గు గని వ్యవహారంపై జాతీయ కాంగ్రెస్ నేతలకు వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది. సింగరేణి టెండర్లు, బొగ్గు బ్లాక్ కేటాయింపులపై వస్తున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు, మీడియాపై కేసుల వరకు వెళ్లిన వ్యవహారం ఇప్పుడు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది.

ఇదే సమయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా సింగరేణిలో కాంగ్రెస్ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు నైనీ టెండర్ల స్కామ్‌లో సీఎం రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, ఆయన బామర్ది సుజన్ రెడ్డి పాత్ర ఉందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉండగా, ఆయన రాష్ట్రానికి తిరిగివచ్చిన వెంటనే ఢిల్లీకి పిలిపించే అవకాశం ఉందని సమాచారం. ఈ వ్యవహారంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న మంత్రులను కూడా హైకమాండ్ పిలిపించి వారి వాదనలు వినే అవకాశముందన్న చర్చ జరుగుతోంది.

అయితే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న అసలు చర్చ మాత్రం వేరే. ఢిల్లీకి వెళ్లినంత మాత్రాన ఈ వ్యవహారంపై నిజమైన విచారణ జరుగుతుందా, లేక ఇది కేవలం ‘సూట్‌కేసుల పంచాయతీ’కే పరిమితమవుతుందా అన్న సందేహం ప్రజల్లో ఉంది. కాంగ్రెస్, బీజేపీ కలిసి ఈ అంశాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రజలకు న్యాయం చేయడం కన్నా, రాబోయే ఎన్నికల కోసం నిధుల సమీకరణే అసలు అజెండాగా ఉందన్న ఆరోపణలు రాజకీయంగా బలపడుతున్నాయి

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, నైనీ బొగ్గు టెండర్ల వివాదం అధికార కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పిగా మారింది. ఈ అంశంపై స్పష్టమైన క్లారిఫికేషన్ ఇవ్వకపోతే, ప్రజల్లో అనుమానాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలతో సమస్య పరిష్కారం అవుతుందా, లేక రాజకీయ డ్రామాగా మిగిలిపోతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *