తెలంగాణలో రైతుల ఆవేదన రోజు రోజుకీ పెరుగుతోంది. పంటలు పండించినా సరైన ధర లేకపోవడం, కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభం కాకపోవడం, వర్షాలతో పంటలు తడిసిపోవడం, ప్రభుత్వ హామీలు అమలు కాకపోవడం వంటి సమస్యలతో రైతులు తీవ్ర నిరాశలో కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరలేదని పలువురు రైతులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
“మంచిగా ఉంటుందని ఓటు వేసాం.. కానీ ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారింది” అంటూ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట ధరలు పడిపోవడంతో మార్కెట్‌కు తీసుకెళ్లకుండా ఇంటి దగ్గరే నిల్వ ఉంచామని, చివరకు వర్షాలతో మొత్తం తడిసిపోయిందని రైతులు చెబుతున్నారు.
“రేటు పడిపోయిందని పంట అమ్మకుండా ఉంచాం. ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నమ్మాం. కానీ చివరకు పంట మొత్తం తడిసిపోయింది. ఇప్పుడు మేము చచ్చే పరిస్థితి వచ్చింది” అంటూ మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపైనా ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు తులం బంగారం, నెలకు ₹2500, రైతులకు రైతు భరోసా, రుణమాఫీ వంటి హామీలు ఇచ్చారని, కానీ వాటిలో చాలా వరకు అమలు కాలేదని గ్రామీణ ప్రాంతాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి.
“రైతు భరోసా లేదు.. రుణమాఫీ లేదు.. 2400 రూపాయల మద్దతు ధర అంటారు కానీ ఎక్కడా కనిపించడం లేదు” అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. “కొంటామని చెబుతారు కానీ లారీలు కూడా పంపరు. మార్కెట్‌కి పంట రానివ్వరు” అని రైతులు ఆరోపిస్తున్నారు.
కొంతమంది రైతులు గత ప్రభుత్వంతో పోల్చుతూ కూడా మాట్లాడుతున్నారు. “కేసీఆర్ ఉన్నప్పుడు కనీసం పంట కొనుగోళ్లు జరిగేవి. డబ్బులు ఆలస్యం కాకుండా వచ్చేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది” అని కొందరు రైతులు అభిప్రాయపడుతున్నారు.
వ్యవసాయానికి అవసరమైన యూరియా, మందులు కూడా సకాలంలో అందడం లేదని రైతులు చెబుతున్నారు. భారీ ఖర్చుతో పంట పండించిన తర్వాత వర్షాలు రావడం, కొనుగోలు లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోతున్నారు.
“మందులు కొట్టి, అప్పులు చేసి పంట పండిస్తాం. చివరకు వానలో తడిసి పంట నాశనం అవుతుంది. కొనేవాళ్లు ఉండరు. ఇలాంటి పరిస్థితిలో రైతు ఎలా బతకాలి?” అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
రాజకీయ హామీలపై కూడా ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. “మళ్లీ ఓట్లు అడగడానికి వస్తే ఏమి చెప్పాలి? మాటలు చెప్పడం తప్ప అమలు ఏమీ లేదు” అంటూ కొందరు మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
గ్రామీణ తెలంగాణలో ప్రస్తుతం రైతుల సమస్యలు ప్రధాన చర్చగా మారాయి. పంట నష్టాలు, మార్కెట్ సమస్యలు, రుణభారం, వర్షాల ప్రభావం, ప్రభుత్వ హామీల అమలు వంటి అంశాలు రాజకీయంగా కూడా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రైతుల ఆవేదనను ప్రభుత్వం ఎంత త్వరగా గుర్తించి చర్యలు తీసుకుంటుందో అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఎందుకంటే రైతు బతికితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

