ప్రధానిని కలిసిన సీఎం రేవంత్.. మెట్రో ఫేజ్-2, త్రిబుల్ ఆర్ఆర్‌కు విజ్ఞప్తి.. అయితే ప్రజల సందేహాలకు సమాధానం ఎప్పుడు?

హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. గురువారం ఢిల్లీలో ప్రధానిని కలిసిన సీఎం, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులు, నిధులు, అనుమతులపై వినతిపత్రాన్ని అందజేశారు.

గోదావరి నదిపై తాగునీరు, సాగునీటి అవసరాలకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ప్రధాని మోదీని సీఎం కోరారు. రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి జలాల వినియోగం అత్యంత కీలకమని వివరించారు.

అదేవిధంగా హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం 122.9 కిలోమీటర్ల మేర విస్తరణకు రూ.38,595 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో అమలు చేయాలని కోరారు.

హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) పనులకు వెంటనే ఆమోదం తెలపాలని కూడా ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఉత్తర భాగంలో భూసేకరణ ఖర్చులో 50 శాతం వాటా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని, జాతీయ రహదారుల సంస్థకు రూ.626 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. ఉత్తర భాగంలో 90 శాతానికి పైగా భూసేకరణ పూర్తయిందని తెలిపారు.

అయితే త్రిబుల్ ఆర్ఆర్ భూసేకరణ విషయంలో రైతుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమ భూములకు మార్కెట్ విలువకు తగ్గ పరిహారం అందడం లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎకరం భూమి విలువ రూ.40 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటే, ప్రభుత్వం అందిస్తున్న పరిహారం రూ.15 లక్షల వరకు మాత్రమే ఉండటంతో మరోచోట భూమి కొనుగోలు చేయడం అసాధ్యంగా మారుతోందని రైతులు వాపోతున్నారు. ఈ అంశంపై రైతులు హైదరాబాద్‌లో నిరసనలు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే.

ఇదే సమయంలో ఫ్యూచర్ సిటీ భూసేకరణ విషయంలోనూ రైతుల్లో ఇలాంటి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటిస్తున్న పరిహారం భూముల వాస్తవ విలువలకు సరిపోవడం లేదని, రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు హైదరాబాద్ మెట్రో నిర్వహణ అంశంపై కూడా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం సుమారు రూ.18,000 కోట్లతో ఎల్ అండ్ టి నుంచి మెట్రో ప్రాజెక్టును స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో, లాభాల్లో నడుస్తోందని భావిస్తున్న సంస్థ ఎందుకు వైదొలిగిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మెట్రో ద్వారా ప్రయాణికుల ఆదాయం, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం, స్టేషన్‌లలోని వాణిజ్య సముదాయాల అద్దెల రూపంలో ఆదాయం లభిస్తున్నప్పటికీ, సంస్థ నష్టాలను చూపిస్తూ ఎందుకు బయటకు వెళ్లిందనే అంశంపై ప్రజలకు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అదేవిధంగా ఎల్ అండ్ టి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు, ప్రభుత్వం వసూలు చేయాల్సిన బకాయిల అంశంపైనా స్పష్టత రావాల్సి ఉందని పలువురు కోరుతున్నారు. ప్రజల సొమ్ముతో నడిచే ప్రాజెక్టుల విషయంలో పూర్తి పారదర్శకత ఉండాలని, ప్రభుత్వం గానీ, సంబంధిత సంస్థలు గానీ ప్రజల ముందుకు వచ్చి వివరాలు వెల్లడించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

మెట్రో ఫేజ్-2, త్రిబుల్ ఆర్ఆర్ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి అవసరమే అయినప్పటికీ, వాటి అమలులో రైతుల ప్రయోజనాలు, ప్రజాధనం వినియోగంపై ఉత్పన్నమవుతున్న సందేహాలను నివృత్తి చేయడం కూడా అంతే ముఖ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *