రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదన.. “మా డబ్బులే ఇవ్వట్లేదు, ప్రభుత్వం చిట్‌ఫండ్‌లా వ్యవహరిస్తోంది”

తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సమస్య మరింత తీవ్రరూపం దాల్చుతోంది. రిటైర్మెంట్ అనంతరం నెలల తరబడి తమకు రావాల్సిన జీపీఎఫ్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పీఆర్సీ అరియర్స్, గ్రాట్యుటీ తదితర బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయల సాధన కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవదాసు మాట్లాడుతూ, “నేను ఏప్రిల్ 2025లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యి ఏడాది పూర్తవుతోంది. జూన్‌లోనే అన్ని బిల్లులు సమర్పించాను. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. నాకు మొత్తం రూ.56 లక్షలు రావాలి. కేవలం పెన్షన్ మాత్రమే వస్తోంది. జీపీఎఫ్ కూడా ఇవ్వలేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

పీఆర్సీ 2020 అరియర్స్ కూడా గతంలో వెంటనే చెల్లించేవారని, ఇప్పుడు అవి కూడా నిలిపివేశారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా రిటైర్మెంట్ బకాయిల కోసం ఎదురుచూస్తూ మానసిక వేదన, అనారోగ్యంతో ఇప్పటివరకు 93 మంది ఉద్యోగులు మరణించారని తెలిపారు. చికిత్సకు డబ్బులు లేక చాలా మంది ఆస్పత్రుల్లో ప్రాణాలు కోల్పోయారని అన్నారు.

ప్రభుత్వం ఇటీవల రూ.1000 కోట్లు చెల్లించామని ప్రచారం చేసుకుందని, కానీ అది వాస్తవానికి కొద్దిమంది ప్రభుత్వ జీపీఎఫ్ ఖాతాదారులకు మాత్రమే అందిందని దేవదాసు ఆరోపించారు. ముఖ్యంగా టీచర్లు, పంచాయతీరాజ్ ఉద్యోగులు, జిల్లా పరిషత్ జీపీఎఫ్ ఖాతాదారులకు ఇప్పటికీ బకాయిలు అందలేదని చెప్పారు.

ఇక రిటైర్డ్ గెజిటెడ్ హెడ్‌మాస్టర్ మారం దేవయ్య మాట్లాడుతూ, “ఇవి ప్రభుత్వ బెనిఫిట్స్ కాదు. మేమే జీవితాంతం దాచుకున్న డబ్బులు. ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేట్ చిట్‌ఫండ్ సంస్థలా వ్యవహరిస్తోంది” అని మండిపడ్డారు. తాను డిసెంబర్ 2024లో రిటైర్ అయ్యానని, ఇప్పటివరకు రూ.92 లక్షల బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. అందులో కేవలం జీపీఎఫ్ మాత్రమే రూ.44 లక్షలకు పైగా ఉందన్నారు.

ప్రభుత్వం 6000 కోట్లు విడుదల చేస్తామని చెబుతున్నా, దాని పంపిణీపై ఎలాంటి స్పష్టత లేదని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. “మాకు రావాల్సిన డబ్బులు పంచుకోండి అని చెప్పడం అవమానకరం. అవి మేము దాచుకున్న సొమ్ము. ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం కాదు” అని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు..

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై చర్చలకు తమ సంఘాలను పిలవకుండా, కేవలం కొందరు ఉద్యోగ సంఘాలతో మాత్రమే ప్రభుత్వం మాట్లాడుతోందని వారు ఆరోపించారు. పైరవీలు, కమిషన్లు లేకుండా సీనియారిటీ ఆధారంగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో 25 వేల మందికి పైగా ఉద్యోగులు రిటైర్ అయ్యారని, వారిలో చాలామందికి బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. “మా డబ్బులు వెంటనే వడ్డీతో సహా చెల్లించాలి. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం” అని రిటైర్డ్ ఉద్యోగులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *