భర్త మృతి తర్వాత ఆస్తి కోసం పోరాటం.. వేధింపులు, దాడులు చేస్తున్నారని మహిళ ఆవేదన

భర్త మరణం తర్వాత తనకు రావాల్సిన ఆస్తి వాటా ఇవ్వకుండా కుటుంబ సభ్యులు తీవ్రంగా వేధిస్తున్నారని ఓ మహిళ కన్నీటి పర్యంతమైంది. గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తనకు వివాహం జరిగిన తర్వాత కూడా ప్రశాంతమైన జీవితం దక్కలేదని చెప్పింది. భర్త జీవించి ఉన్న సమయంలోనే కుటుంబంలో విభేదాలు ఉండేవని, భర్త మరణించిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారిందని ఆరోపించింది.

తన భర్త కష్టపడి నిర్మించిన ఇంటిలో ఉండనివ్వకుండా, “నీకు పిల్లలు లేరు.. ఇక్కడ ఉండే హక్కు లేదు” అంటూ ఇంటి నుంచి వెళ్లిపోవాలని బంధువులు ఒత్తిడి చేస్తున్నారని ఆమె తెలిపింది. తనకు రావాల్సిన ఐదున్నర గుంటల భూమి, ఇతర ఆస్తి వాటా, అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను కూడా ఇవ్వడం లేదని ఆరోపించింది.

ఈ విషయంపై పలుమార్లు గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించినా ఎలాంటి న్యాయం జరగలేదని పేర్కొంది. పోలీసులను ఆశ్రయించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫిర్యాదు స్వీకరించకుండా రాజీ చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆరోపించింది.

గత ఎనిమిది నెలలుగా తనపై దాడులు, బెదిరింపులు కొనసాగుతున్నాయని, ఇంట్లో ఉండనివ్వకుండా వేధిస్తున్నారని ఆమె కన్నీటి పర్యంతమైంది. తనకు రావాల్సిన చట్టబద్ధమైన వాటాను ఇప్పించి, ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను వేడుకుంది.

ఈ ఘటనపై స్పందించిన స్థానికులు, భర్త మరణించిన మహిళకు చట్టప్రకారం రావాల్సిన హక్కులను కల్పించి, ఆమె భద్రతను నిర్ధారించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే మహిళ చేసిన ఆరోపణలపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలు నిర్ధారించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *