సైబర్ నేరాలు రోజురోజుకీ కొత్త రూపాలు దాలుస్తున్నాయి. ఇప్పటివరకు ఫోన్ కాల్స్, డిజిటల్ అరెస్టులు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాల ద్వారా ప్రజలను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి నేరుగా బ్యాంకులనే బురిడీ కొట్టించే స్థాయికి వెళ్లిపోయారు. తాజాగా గుజరాత్లో వెలుగుచూసిన ఒక ఘటన పోలీసులను సైతం షాక్‌కు గురి చేసింది.
అహ్మదాబాద్ కు చెందిన ఓ ఇంపోర్ట్-ఎక్స్పోర్ట్ వ్యాపారిని లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు అతని వ్యక్తిగత వివరాలను పూర్తిగా హ్యాక్ చేసి, ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ టెక్నాలజీతో అతని బయోమెట్రిక్ ధృవీకరణను కూడా బైపాస్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.
వ్యాపారికి రెండు మూడు రోజుల పాటు బ్యాంక్ నుంచి వచ్చే ఓటీపీలు రాకపోవడంతో అనుమానం వచ్చింది. అనంతరం పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. సైబర్ నేరగాళ్లు ముందుగా అతని మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానమైన ఖాతా నుంచి మార్చేశారు. దీంతో బ్యాంక్ అలర్ట్‌లు, ఓటీపీలు బాధితుడి ఫోన్‌కు కాకుండా నేరగాళ్లకు వెళ్లేలా చేశారు.
దర్యాప్తులో మరింత షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. బాధితుడి సోషల్ మీడియా ఫోటోలను ఉపయోగించి ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ వీడియో రూపొందించిన నేరగాళ్లు, దానిని ఐరిస్ ఆథెంటికేషన్ ప్రక్రియలో ఉపయోగించినట్టు పోలీసులు తెలిపారు. ఈ విధంగా ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను సైతం బైపాస్ చేసినట్టు వెల్లడైంది.
ఇక్కడితో ఆగకుండా నేరగాళ్లు బాధితుడి DigiLocker ఖాతాలోకి కూడా ప్రవేశించి ఆధార్, పాన్, ఇతర కీలక పత్రాలను యాక్సెస్ చేశారు. అనంతరం బాధితుడి పేరుతో కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి రూ.25 వేల లోన్ కూడా తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఒకరు కామన్ సర్వీస్ సెంటర్లో పనిచేస్తున్న వ్యక్తి అని, అధికారిక యాక్సెస్‌ను దుర్వినియోగం చేసి ఈ మోసానికి సహకరించినట్టు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనతో ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీ ఎంత ప్రమాదకర స్థాయికి చేరుకుందో మరోసారి స్పష్టమైంది. ఒక వ్యక్తి సోషల్ మీడియా ఫోటోలు మాత్రమే ఆధారంగా తీసుకుని అతని బయోమెట్రిక్ గుర్తింపునే మార్చేయడం ఇప్పుడు పెద్ద హెచ్చరికగా మారింది.
సైబర్ నిపుణులు ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు, ఆధార్ సంబంధిత వివరాలు అధికంగా పంచుకోవద్దని, మొబైల్ నెట్వర్క్ అకస్మాత్తుగా పనిచేయకపోతే వెంటనే బ్యాంక్, టెలికాం సంస్థలను సంప్రదించాలని హెచ్చరిస్తున్నారు. అలాగే డిజీ లాకర్, బ్యాంకింగ్ యాప్స్‌కు టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ తప్పనిసరిగా ఉపయోగించాలని సూచిస్తున్నారు.

