పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో ఏజెన్సీ ఆదివాసులకు 75% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో ఏజెన్సీ ప్రాంత ఆదివాసులకు గతంలో అమలైన 75 శాతం రిజర్వేషన్ ప్రస్తావన లేకపోవడంపై ఆదివాసి నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో అమలులో ఉన్న జీవో నెం.49 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లోని స్థానిక ఆదివాసులకు 75 శాతం రిజర్వేషన్‌ను కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఆదివాసి సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, 2022, 2018, 2015 సంవత్సరాల్లో విడుదలైన నోటిఫికేషన్లలో ఏజెన్సీ ప్రాంతాలకు 75 శాతం రిజర్వేషన్ స్పష్టంగా పేర్కొనబడిందని తెలిపారు. అయితే, 2026 నోటిఫికేషన్‌లో “స్పెషల్ కేటగిరీస్” అనే పదం మాత్రమే ఉండి, 75 శాతం రిజర్వేషన్‌పై స్పష్టమైన ప్రస్తావన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రం అందజేసినట్లు వారు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిని కూడా కలిసి తమ అభ్యర్థన వివరించినట్లు చెప్పారు. అయితే, గతంలో ఉన్న జీవో నెం.3 రద్దు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెప్పారని, కానీ జీవో నెం.3 ఉపాధ్యాయ నియామకాలకు మాత్రమే సంబంధించినదని వారు వివరించారు.

పోలీస్ కానిస్టేబుల్ నియామకాల కోసం ప్రత్యేకంగా జీవో నెం.109 ఉండేదని, దానిని 2018లో సవరించి జీవో నెం.49గా అమలు చేశారని తెలిపారు. ఈ జీవో ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లోని స్థానిక ఆదివాసులకు సివిల్ కానిస్టేబుల్ పోస్టుల్లో 75 శాతం రిజర్వేషన్ కల్పించాలని స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు.

ఈ రిజర్వేషన్ అమలు చేయకపోతే ఆదివాసి యువతకు భారీ నష్టం జరుగుతుందని వారు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 139 పోస్టులు ఉంటే 75 శాతం రిజర్వేషన్ ప్రకారం 104 పోస్టులు లభిస్తాయని, ప్రస్తుతం 10 శాతం మాత్రమే అమలైతే 14 పోస్టులు మాత్రమే దక్కుతాయని తెలిపారు. దీంతో సుమారు 90 ఉద్యోగాలు కోల్పోతున్నామని అన్నారు.

అలాగే ఆదిలాబాద్ జిల్లాలో 130 పోస్టుల్లో 75 శాతం అమలు చేస్తే దాదాపు 98 నుంచి 102 పోస్టులు, 10 శాతం అమలైతే కేవలం 13 పోస్టులు మాత్రమే వస్తాయని వివరించారు. ములుగు జిల్లాలో 98 పోస్టుల్లో 75 శాతం ప్రకారం 74 పోస్టులు, 10 శాతం అమలైతే కేవలం 10 పోస్టులు మాత్రమే దక్కుతాయని తెలిపారు.

ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, ములుగు, నాగర్‌కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం వంటి ఏజెన్సీ జిల్లాలన్నింటిని కలిపి చూస్తే సుమారు 600 ఉద్యోగాలు ఆదివాసులు కోల్పోయే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు.

తాము ఎలాంటి అదనపు సౌకర్యాలు కోరడం లేదని, గతంలో అమలులో ఉన్న నిబంధనలను యథాతథంగా కొనసాగించాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. గవర్నర్ ఆమోదించిన గెజిట్, జీవో నెం.49 ప్రకారం తమకు ఉన్న హక్కును అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

అంతేకాకుండా, ఆదివాసి ఎమ్మెల్యేలు మరియు ప్రజాప్రతినిధులు ఈ అంశంపై స్పందించి ప్రభుత్వంతో చర్చించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో సవరణ నోటిఫికేషన్ విడుదల చేసి 75 శాతం రిజర్వేషన్ అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

చివరగా, “మేము న్యాయబద్ధమైన హక్కును మాత్రమే కోరుతున్నాం. ఆదివాసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి మా హక్కులను కాపాడాలి” అంటూ తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *