సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ మెట్రో అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సేర్లింగంపల్లి బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడిన ఆయన, మెట్రోకు సంబంధించిన వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులపై ప్రభుత్వం కన్నేసిందని విమర్శించారు.
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న సుమారు 250 ఎకరాల భూములు, దాదాపు రూ.30 వేల కోట్ల విలువైన ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేటీఆర్ ఆరోపించారు. మెట్రో నిర్వహణలో ఉన్న ఎల్‌అండ్‌టీ సంస్థపై ఒత్తిడి తెచ్చి, అధికారులను బ్లాక్‌మెయిల్ చేసి రాష్ట్రం నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం జరిగిందని అన్నారు.
మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన సుమారు రూ.14 వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రజల నెత్తిపై మోపే పరిస్థితి తీసుకొచ్చారని కేటీఆర్ విమర్శించారు. ప్రజా ధనంతో ప్రైవేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
లకిడీకాపూల్ నుంచి పటాన్‌చెరు వరకు మెట్రో విస్తరణ ప్రతిపాదనకు గతంలో కేంద్రం ఆమోదం తెలపలేదని గుర్తు చేసిన కేటీఆర్, ఇప్పుడు అదే అంశంపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కొత్త నాటకాలు ఆడుతున్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గత ప్రతిపాదనలను ఎందుకు తిరస్కరించారో చెప్పాలని ప్రశ్నించారు.
రాష్ట్రంలో పెరుగుతున్న అప్పుల భారం పట్ల కూడా కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలపై భారీ అప్పు భారం ఉందని, కొత్త ప్రాజెక్టుల పేరుతో మరిన్ని వేల కోట్ల రూపాయల రుణాలు తెచ్చి భవిష్యత్ తరాలపై భారం మోపుతున్నారని అన్నారు.
అదే సమయంలో రాష్ట్ర ఆదాయం, ఖర్చులు, అప్పులు, సంక్షేమ పథకాల అమలుపై పూర్తి పారదర్శకత తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వం గతంలో ప్రకటించిన డిజిటల్ డాష్‌బోర్డ్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు.
ప్రతి శాఖకు ఎంత నిధులు కేటాయిస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎంత అప్పు తెస్తున్నారు, సంక్షేమ పథకాల అమలు పరిస్థితి ఏమిటి వంటి వివరాలను ప్రజలు నేరుగా చూసే విధంగా 24 గంటలూ అందుబాటులో ఉండే డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
ప్రజాపాలన అంటే ప్రజలకు సమాచారం అందుబాటులో ఉండడమేనని, ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలపై పూర్తి పారదర్శకత ఉంటే ప్రజలే ప్రభుత్వ పనితీరుకు మార్కులు వేస్తారని కేటీఆర్ పేర్కొన్నారు.

