హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఎంత మేర ధాన్యం, ఇతర పంటలను కొనుగోలు చేస్తే అంత మేరకే రాష్ట్రం కూడా రైతుల నుంచి సేకరణ చేపడుతుందని ప్రకటించడం రైతుల్లో ఆందోళనకు దారితీస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఇన్ఫార్మల్ క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు వెల్లడించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం నిర్దేశించిన విధి విధానాల ప్రకారం పంటల కొనుగోళ్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కేంద్రం కొనుగోలు చేసే పరిమాణాన్ని అనుసరించే విధంగా రాష్ట్ర సేకరణ ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే కేంద్రం రాష్ట్రానికి కేటాయించాల్సిన ఎరువుల కోటాను పూర్తిగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అయితే ఈ ప్రకటనపై రైతు వర్గాల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం కొనుగోలు చేసే పరిమాణానికే పరిమితం అయితే, అదనంగా ఉత్పత్తి చేసే రైతుల పంటల పరిస్థితి ఏమవుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి మొత్తం పంటకు మార్కెట్ హామీ ఇవ్వాల్సిన సమయంలో ఇలాంటి ప్రకటన రైతులను మరింత అనిశ్చితిలోకి నెడుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి
రైతు సంఘాల అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం కొనుగోళ్ల నుంచి వెనక్కి తగ్గితే ప్రైవేట్ వ్యాపారులు, దళారుల ఆధిపత్యం పెరిగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో రైతులు గిట్టుబాటు ధర కోల్పోయి తక్కువ ధరలకు పంట అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే రైతు భరోసా, బోనస్ చెల్లింపులు, పంటల కొనుగోలు వంటి అంశాలపై ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని, ఇప్పుడు కొనుగోళ్లను కేంద్రం కోటాకు పరిమితం చేస్తే రైతుల్లో విశ్వాసం దెబ్బతింటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చలు జరిపి కొనుగోలు పరిమాణాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
అలాగే రామగుండంలో ఉత్పత్తి అవుతున్న యూరియాను తెలంగాణ అవసరాలకు ప్రాధాన్యంగా కేటాయించాలని రాష్ట్ర మంత్రివర్గం కేంద్రాన్ని కోరింది. ప్రస్తుతం రాష్ట్ర అవసరాలకు సరిపడా ఎరువుల సరఫరాపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
జూన్ 30న మధిరలో నిర్వహించనున్న బహిరంగ సభలో రైతు భరోసా పథకానికి సంబంధించిన కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. అయితే పంటల కొనుగోళ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

